కేసీఆర్ కుటుంబమే మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కారణం: రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని..మొదటి దోషి సీఎం కేసీఆర్‌ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

By Srikanth Gundamalla  Published on  22 Oct 2023 4:32 PM IST
revanth reddy, medigadda barrage, bridge sagged ,

 కేసీఆర్ కుటుంబమే మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కారణం: రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని..ఆ అవినీతిలో మొదటి దోషి సీఎం కేసీఆర్‌ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీ వేదికగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్‌ ప్రమాదానికి గురికావడంపై స్పందించారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు.

నాణ్యత లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజ్‌ ప్రమాదానికి గురైందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. కాళేశ్వరంలో ఉన్న డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని చెప్పారు రేవంత్‌. ప్రస్తుతం ఎలాంటి వరదలు లేవు.. అయినా మేడిగడ్డ బ్యారేజ్‌ ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటారని.. అలాంటి ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబం ధనదాహానికి బలి అయ్యిందంట రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మార్చుకుందని.. కోట్ల డబ్బులు దోచుకున్నారంటూ రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని గొప్పులు చెప్పారు.. బస్సులు పెట్టి రైతులు, నాయకులను తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారని అన్నారు. గోదావరి నదికి వచ్చిన వరదల్లో పంప్‌హౌస్‌లు మునిగాయని చెప్పారు. అప్పుడు మేం చూడటానికి వెళ్తామంటే అడ్డుకున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ మొదటి నుంచి చెప్తున్నారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తామని.. తమతో పాటు బీఆర్ఎస్‌ నాయకులూ రావాలన్నారు రేవంత్. ప్రాజెక్టులో ఉన్న లోపాలను తాము చెప్తామని.. అలాగే అద్భుతాలు ఏమున్నాయో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి విచారణకు ఆదేశించాలని గవర్నర్‌, సీవీసీని కోరుతున్నట్లు రేవంత్‌రెడ్డి అన్నారు. నిపుణులతో కూడిన విజిలెన్స్‌ కమిషన్ వస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లోపాలు బయటపడతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రంపైనా విమర్శల చేశారు రేవంత్. బీఆర్ఎస్‌, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందుకే కాళేశ్వరంపై బీజేపీ స్పందించడం లేదన్నారు. ఒకవేళ బీఆర్ఎస్‌తో బీజేపీ కలవకపోతే దర్యాప్తునకు విజిలెన్స్‌ కమిషన్ నియమించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story