వివాహిత ఆత్మహత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు, ముగ్గురికి యావజ్జీవం
వరకట్న వేధింపులు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువయ్యాయి.
By Srikanth Gundamalla
వివాహిత ఆత్మహత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు, ముగ్గురికి యావజ్జీవం
వరకట్న వేధింపులు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువయ్యాయి. చాలా మంది వరకట్నం కోసం అమ్మాయిలను వేధిస్తున్నారు. భర్తతో పాటుగా అత్తవారింట్లోని కుటుంబ సభ్యులు దాడులకు తెగబడ్డ సంఘటనలు ఉన్నాయి. అయితే.. వరకట్న వేధింపులను తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం పూల్‌సింగ్ తండాకు చెందిన పత్లావత్ సురేంద్‌కు సునీత అనే మహిళతో వివాహం జరిగింది. వరకట్నంగా అప్పుడే సునీత తల్లిదండ్రులు రూ.5లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు. అయితే.. సునీత-సురేందర్ దంపతులకు కుమారుడు, కుమార్తె కూడా ఉన్నాయి. వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత నుంచి సునీతను భర్త వేధించడం మొదలుపెట్టాడు. అత్త పీక్లి, ఆడపడచు సంతోష కూడా ఇందులో కలగచేసుకున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులను తాళలేక 2021 జనవరి 10వ తేదీన సునీత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
తాజాగా ఈకేసులో విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హరీష సంచలన తీర్పు ఇచ్చారు. వివాహితను వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైనందుకు భర్తతో పాటు అత్త, ఆమె ఆడచపడుచుకి యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అలాగే రూ.50వేల జరిమానా కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది.