Ibrahimpatnam: సమాచారం లేకుండా పోస్టల్‌ బ్యాలెట్ తెరవడంపై చర్యలు

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 4:42 AM GMT
ranga reddy, ibrahimpatnam, postal ballot, isuue ,

Ibrahimpatnam: సమాచారం లేకుండా పోస్టల్‌ బ్యాలెట్ తెరవడంపై చర్యలు

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే.. ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు అధికారులు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద పోస్టల్‌ బాక్సులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెరిచారని వివాదం చెలరేగింది. పార్టీల ఏజెంట్లకు తెలియకుండానే వాటిని ఓపెన్ చేశారని రగడ మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ సహా ఇతర నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికార పార్టీకి ఎన్నికల అధికారులు మద్దతుగా ఉన్నారనీ.. అందుకే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టల్‌ బ్యాలెట్ బాక్సులను తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్ట్రాంగ్‌రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్‌ బ్యాలెట్‌లు ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రత్యక్షం అయ్యాయని చెప్పారు. అంతేకాదు.. అవి సీల్‌ తొలగించి కనిపించాయిన.. బ్యాలెట్లు లేకపోవడంపై రిటర్నింగ్ అదికారిని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్ ఓట్లు నమోదు అయ్యాయి. వీటికి సంబంధించి ఆరు బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాలి. కానీ ఆ ఆరు బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ఉండటంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి తీరుని వ్యతిరేకిస్తూ ఆందోలన చేపట్టారు. దాంతో.. పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను ఆర్డీవో కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి అధికారులు వాటిని సీల్ వేశారు.

చివరకు జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆర్డీవో కార్యాలయానికి వచ్చి పరిశీలించారు. ఆ సమయంలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో.. పోలీసులు వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్‌ అభ్యర్తి మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి ఆర్డీవో కార్యాలయాని చేరుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ అంశంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు. మరోవైపు తప్పు జరిగిందని అధికారులు ఒప్పుకున్నారు. దాంతో.. బ్యాలెట్‌ బాక్సులు తెరిచి ఉంచడంపై విచారణ జరిపిస్తామని కలెక్టర్‌ చెప్పారు. తప్పు జరిగినట్లు తేలితే సంబంధింత అధికారులందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిప్యూటీ తహశీల్దార్ ను సస్పెండ్ చేసి ఆర్వో, ఏఆర్వోకు నోటీసులు ఇచ్చారు కలెక్టర్ భారతి హోలికేరి.

Next Story