ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: రాచకొండ సీపీ
ఉప్పల్‌లో మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
By Srikanth Gundamalla Published on 19 March 2024 5:45 PM ISTఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: రాచకొండ సీపీ
ఈ నెల 22 నుంచి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్ మొదలు కాబోతుంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నన్ని రోజులు పండుగ వాతావరణంలో ఉంటారు. అయితే.. ఇప్పటికే తొలి షెడ్యూల్ విడుదల కాగా.. ఇవి జరుగుతుండగానే రెండో షెడ్యూల్ కూడా రాబోతుంది. రెండో షెడ్యూల్ కూడా ఇండియాలోనే జరుగుతాయని బీసీసీఐ అధికారులు హింట్ ఇవ్వడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా కూడా కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి. ఉప్పల్‌లో మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఇక్కడ నిర్వహించే క్రికెట్ మ్యాచ్‌లపై రాచకొండ పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. భద్రతతో పాటు ఇతర ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ల నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు, సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. టికెట్ల పంపిణీ విషయంలో ఎలాంటి గందరగోళం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు తరుణ్ జోషి. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహణ బృందంతో కూడా టికెట్ల పంపిణీపై మాట్లాడారు.
స్టేడియం వద్ద ప్రేక్షకుల కోసం అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లను చూసుకోవాలని కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేశారు. ఉప్పల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందుగానే పలు వాహనదారులకు పలు సూచనలు చేయాలని చెప్పారు. అలాగే స్టేడియం పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. అవి నిత్యం పనిచేసేలా చూసుకోవాలని కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపై దృష్టి పెట్టాలనీ.. సాధారణ ప్రజలు మోసపోకుండా చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇక టికెట్ల పంపిణీ కూడా పారదర్శకంగానే జరుగుతుందనీ.. పుకార్లు ఎవరూ నమ్మొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు.