ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం

చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

By Srikanth Gundamalla
Published on : 9 Dec 2023 3:49 AM

protem speaker, akbaruddin Owaisi, telangana assembly,

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ తమిళిసై.. అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. సాధారణంగా ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలను సీనియర్ ఎమ్మెల్యేలకు అప్పగిస్తుంటారు. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్‌ చాలా సీనియర్ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా చేస్తారా అని కోరగా.. అక్బరుద్దీన్‌ ఒవైసీ అంగీకరించారు. ప్రొంటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. కాగా.. ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ సమావేశం కానుంది. సభలో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.

అయితే.. బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్బరుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోను అని చెప్పారు. ఆయన ఒక్కరే కాకుండా గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేయబోరని అన్నారు. దాంతో.. రాజాసింగ్‌తో పాటు మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారా లేదా అన్నది చూడాలి. 2018లో కూడా రాజాసింగ్ గెలిచిన తర్వాత ప్రొటెం స్పీకర్‌ వద్ద ప్రమాణం చేయలేదు. అప్పట్లో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ వ్యవహరించారు. అప్పుడు రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం, ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి అవకాశం ఇచ్చారని రాజాసింగ్ ఆరోపించారు. దాంతో.. ముంతాజ్‌ఖాన్‌ సమక్షంలో కాకుండా పూర్తిస్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్‌ చాంబర్‌లో రాజాసింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

Next Story