ఇవాళ, రేపు తెలంగాణలో ప్రియాంకగాంధీ పర్యటన
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 9:30 PM IST
ఈ నెల 24, 25 తేదీల్లో తెలంగాణలో ప్రియాంకగాంధీ పర్యటన
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్య నేతలంతా పార్టీ అభ్యర్థుల తరఫున ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటు వైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు.
అయితే.. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారు. శుక్రవారం, శనివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో సభలో పాల్గొంటారు ప్రియాంక గాంధీ. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. రాష్ట్రంలో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకి మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొననున్నారు. 24వ తేదీ ఖమ్మంలోనే బస చేయనున్నారు ప్రియాంకగాంధీ. ఆ తర్వాత 25వ తేదీ ఉదయం 11 గంటలకు పాలేరు, మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తుపల్లి, మధ్యాహ్నం 2.40 గంటలకు మధిర ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రియాంకా గాంధీ పర్యటన కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మధిరలో సభ ముగిసిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు ప్రియాంక గాంధీ.