లాస్య నందితను వెంటాడిన మృత్యువు, 12 తాయ‌త్తుల గుర్తింపు!

శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో కంటోన్మెంట్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 3:30 AM GMT
Postmortem, amulets, of Lasya Nandita, dead body,

లాస్య నందితను వెంటాడిన మృత్యువు, 12 తాయ‌త్తుల గుర్తింపు!

శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో కంటోన్మెంట్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో లాస్య నందిత మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. ఆమెకు ప్రమాదంలో ఎడమ కాలు విరిగిపోయందనీ.. దంతాలు ఊడిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. లాస్య నందిత డెడ్‌బాడీకి గాంధీ ఫొరెన్సిక్‌ మెడిసిన్ హెచ్‌ఓడీ కృపాల్‌సింగ్, ప్రొఫెసర్ లావణ్య కౌషిల్‌ నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేసింది.

లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత వరుసగా మూడుసార్లు మృత్యువు వెంటాడింది. మొదటి రెండుసార్లు ప్రాణాలతో బయటపడిన ఆమె.. మూడోసారి జరిగిన రోడ్డుప్రమాదంలో మాత్రం చనిపోయారు. కంటోన్మెంట్‌లో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రి ప్రారంభోతవ్సం సందర్భంగా గతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దాంతో.. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది, ఇతర కార్యకర్తలు లిఫ్ట్‌ను బలవంతంగా ఓపెన్ చేసి లాస్య నందితను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కేసీఆర్‌ బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా లాస్య ప్రయాణిస్తున్న కారు నల్లగొండ వద్ద టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే.. ఈ ప్రమాదంలో కారుకింద పడి ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇలా వరుసగా రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డ లాస్య నందితను మూడోసారి రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. అయితే.. వరుసగా రెండు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో లాస్య నందిత పలు ఆలయాలు, బాబాల వద్ద ప్రత్యేక పూజలు చేయించుకుని తాయిత్తులు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో మృతదేహంపై సుమారు 12 తాయిత్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సందర్భంగా వాటిని తొలగించి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Next Story