బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు
జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 6:55 AM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు
జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ, మధుకర్‌రెడ్డిలపై మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని బుద్ధనగర్‌కు చెందిన రాధిక ఫిర్యాదు ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పోలీసుల ఎఫ్‌ఐఆర్ వివరాల మేరకు.. ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో ఎంఏ రషీద్, ఎంఏ ఖాదర్ పేరిట సర్వే నంబర్ 796లో ఉన్న భూమిలో 1984-85 ప్రాంతంలో వెంచర్ నిర్మించారు. లేఅవుట్‌లోని 167 ఓపెన్ ప్లాట్లను పలువురు కొనుగోలు చేశారు. 2020లో ఇదే లేఅవుట్‌లో 150 చదరపు గజాల ప్లాటుని ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి నుంచి ముచ్చర్ల రాధిక కొనుగోలు చేసింది. కాగా.. కొంతకాలం క్రితం ఈ స్థలంలోకి గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నీలిమ, మధుకర్‌రెడ్డిలు దౌర్జన్యంగా ప్రవేశించారనీ.. స్తంభాలు తొలగించి నిర్మాణం కోసం తవ్విన గుంతలు పూడ్చేశారని ఫిర్యాదులో రాధిక పేర్కొంది. అలాగే తప్పుడు పత్రాలు సృష్టించి మండల రెవెన్యూ కార్యాలయంలోని లేఅవుట్‌లో వివరాలను మార్చారని, తమ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కేసు నమోదు కావడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తమపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని అన్నారు. తమకు భూముల గురించి ఎవరితో గొడవలు లేవని చెప్పుకొచ్చారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఎవరున్నారనే కనీస సమచారం కూడా తమవద్ద లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కనీస సమాచారం లేకుండా పోలీసులు బాధ్యతారహితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఒకవేళ భూ వివాదాలుంటే సివిల్ కోర్టుకు వెళ్లాలని అన్నారు. అయితే.. ఎవరెన్ని కేసులు పెట్టినా తాము భయపడబోమని.. చట్టం, న్యాయం పై నమ్మకం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.