మాజీ డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

పరిగి మాజీ ఎమ్మెల్యే, ఆజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (76) కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2023 2:31 AM GMT
Parigi EX MLA, BRS Senior Leader, Harish Reddy, death,

మాజీ డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ రాజకీయాల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే, ఆజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (76) కన్నుమూశారు. గతకొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న హరీశ్వర్‌రెడ్డి కార్డియాక్‌ అరెస్ట్‌తో శుక్రవారం రాత్రి మరణించారు.

బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం హరీశ్వర్‌రెడ్డి పరిగిలో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ చికిత్స పొందుతూనే హరీశ్వర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. సీఎం కేసీఆర్‌కు హరీశ్వర్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు.

హరీశ్వర్‌రెడ్డి వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి.. మంచి స్థానం సంపాదించుకునే వరకు ఎదిగారు. పరిగి ఉప సర్పంచ్‌గా, ఆ తర్వాత 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్‌ చైర్మన్‌గానూ హరీశ్వర్‌రెడ్డి సేవలందించారు. 1985, 1994, 1999, 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా కూడా హరీశ్వర్‌రెడ్డి పని చేశారు. కాగా.. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం పరిగిలోనే నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అంటూ కేసీఆర్ కొనియాడారు. హరీశ్వర్‌రెడ్డితో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత హరీశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story