తెలంగాణలో మరో కీలక ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
దేశంలోనే ఔటర్ రింగ్ రైల్ ఉన్న తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2023 11:30 AM IST
తెలంగాణలో మరో కీలక ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో మరో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా ఔటర్‌రింగ్ రైలు ప్రాజెక్టు రానుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై రైల్వే శాఖ చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
త్వరలో రీజనల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా ఔటర్‌రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రైలుతో హైదరాబాద్ అభివృద్ధిలో మరింత దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రూట్ దాదాపుగా ఖరారైందని తెలిపారు.
దేశంలోనే ఔటర్ రింగ్ రైల్ ఉన్న తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కోసం తుది లోకేషన్ సర్వే చేపట్టేందుకు కేంద్రం రూ.13.95 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.26,000 కోట్లతో చేపట్టనున్నట్లు వివరించారు. రూట్‌మ్యాప్‌కు సంబంధించి దాదాపు 90 శాతం సన్నాహాలు పూర్తయ్యాయని చెప్పారు కిషన్‌రెడ్డి. అంతేకాదు.. ప్రాజెక్టు కోసం భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం కేంద్రమే భరించనుందని తెలిపారు.
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, మెదక్, ముంబై, వికారాబాద్ రైల్వే లైన్లను కలుపుతూ జంక్షన్లు ఏర్పాటు చేస్తామన్నారు కిషన్‌రెడ్డి. ఈ మార్గాల్లో వెళ్లేవారు నగరంలోకి వెళ్లకుండా ఔటర్‌రింగ్‌రోడ్డు దగ్గర నుంచి బయటకు వెళ్లి రోడ్డు లేదంటే రైలు మార్గంలో తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. దీనివల్ల వ్యాపారంతో పాటు రవాణా రంగానికి గణనీయంగా లాభాలు వస్తాయని చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా ఘట్కేసర్-రాయగిరి మధ్య ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనులను కూడా కేంద్రం చేపడుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎనిమిదేళ్లు గడిచినా ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపిందని ఆరోపించారు. రూ.330 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని చెప్పారు. రైల్వే నిధులతోనే పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.