Nizamabad: మాకేది సార్ ఫ్రీ జర్నీ.. బస్టాండ్ వద్ద వ్యక్తి ధర్నా

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 11:19 AM GMT
nizamabad, man fight,  free journey,  rtc buses,

 Nizamabad: మాకేది సార్ ఫ్రీ జర్నీ.. బస్టాండ్ వద్ద వ్యక్తి ధర్నా

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. మహాలక్ష్మి పేరుతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే.. ఫ్రీ జర్నీ కావడంతో పెద్ద ఎత్తున మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ చూసిన బస్సుల్లో మహిళలే కనిపిస్తున్నారు. కొన్ని రూట్లలో అయితే.. బస్సుల్లో కనీసం నిలబడే అవకాశం కూడా ఉండటం లేదు.

ఈ క్రమంలోనే నిజామాబాద్‌ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మగవారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలంటూ బస్టాండ్‌లో నిరసన చేశాడు. రోడ్డుపైకి వచ్చి బస్సులను పోనివ్వకుండా అడ్డుకుని హంగామా చేశాడు. మహిళలకు ఉచిత ప్రయాణం పక్కకు పెడితే.. పురుషులు టికెట్‌ కొనుక్కుని మరీ నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మగవారి కోసం పోరాటం చేశాడు. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశాడు. పలు బస్సులు ముందుకు వెళ్లనివ్వకుండా వాటి ముందు నిలబడి నిరసన తెలిపాడు. ఆర్టీసీ బస్సుల్లో మగవారికి కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు. సదురు వ్యక్తి బస్టాండ్ వద్ద హంగామా చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వ్యక్తికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

మహిళలకు ఫ్రీ జర్నీ వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌ బస్‌ డిపో వద్ద మహిళలు ఆందోళనచేశారు. రెండు గంటల సమయం గడిచినా హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు లేవంటూ మండిపడ్డారు. చిన్నపిల్లలతో పాటు వచ్చామనీ.. ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. డిపో అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ప్రయాణికులు ఆరోపించారు.

Next Story