Nizamabad: పెళ్లిలో మటన్ కోసం ఘర్షణ, 8 మందికి గాయాలు..కేసు నమోదు
పెళ్లి అంటే హడావుడి ఉంటుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 8:15 AM ISTNizamabad: పెళ్లిలో మటన్ కోసం ఘర్షణ, 8 మందికి గాయాలు..కేసు నమోదు
పెళ్లి అంటే హడావుడి ఉంటుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ముఖ్యంగా పెళ్లికి హాజరైన అతిథుల కోసం కమ్మనైన వంటకాలను పెడతారు. నాన్‌వెజ్‌ను ఇష్టపడే వారికి సరిపోయినంత వడ్డిస్తూ ఉంటారు. అయితే.. పెళ్లిలో వంటల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు గొడవలు జరుగుతుంటాయి. తాజాగా నిజామాబాద్‌లోనూ అదే జరిగింది. చిన్న గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని కేసు నమోదు చేసే వరకూ వెళ్లింది.
నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన ఒక యువతితో.. నందిపేట మండలానికి చెందిన యువకుడి వివాహం జరిపించారు. ఈ కార్యక్రమాం ఓ ఫంక్షన్ హాలులోనే జరిగింది. పెళ్లి తంతు పూర్తయిన వెంటనే విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వరుడు తరఫున కొందరు తినేందుకు వెళ్లారు. వారికి వడ్డించే వారు మాంసాహారం వడ్డించారు. వారికి మటన్ ముక్కలు తక్కువగా వేశారంటూ యువకులు గొడవకు దిగారు. దాంతో.. వధువు తరఫు బంధువులు కల్పించుకున్నారు. గొడవ కాస్త పెద్దది అయ్యింది. చివరకు కొట్టుకునే వరకూ వెళ్లింది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఉద్రిక్త వాతావరణం కలిపించింది. చివరకు దీనికి గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకున్నారు.ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఒక వర్గానికి చెందిన 11 మంది, మరో వర్గానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘర్షణలో గాయపడ్డ ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. మటన్ కోసం తీవ్రంగా గొడవపడిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.