హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఈ రూట్‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 1:40 AM GMTహైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఈ రూట్‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-పటాన్‌చెరు మార్గంలో కొత్త ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15 నుంచి ఈ బస్సులు ప్రారంభం అవుతాయని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
సికింద్రాబాద్-పటాన్‌చెరు రూట్‌లో ప్రతి 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ సంస్థ తెలిపింది. 219 రూట్ నెంబర్ గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు పారడైస్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి మీదుగా పటాన్‌చెరుకి చేరుకుంటాయి. తిరిగి అదే మార్గంలో సికింద్రాబాద్‌కు వస్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారంతా ఈ ఏసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బస్సుల్లో అంతకుముందుతో పోలిస్తే రద్దీ మరింత ఎక్కువైంది. ఈ మహాలక్ష్మి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు అంతా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలకగకుండా టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని సజ్జనార్ తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మహిళలంతా స్థానికతను తెలిపేవిధంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించాల్సి ఉంటుందని చెప్పారు. మరో వైపు బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన కారణంగా.. ఆయా రూట్లలో రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. రద్దీ సమయంలో కొంత సంయమనం పాటించాలని ప్రయాణికులను కోరారు. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చెప్పారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.