కొత్త ప్రభాకర్‌పై దాడితో అలర్ట్.. వారందరికీ భద్రత పెంపు
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 5:28 PM ISTకొత్త ప్రభాకర్‌పై దాడితో అలర్ట్.. వారందరికీ భద్రత పెంపు
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు భద్రత పెంచేందుకు ఇంటలిజెన్స్ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి అదనంగా ఇద్దరు గన్‌మెన్లను కేటాయిస్తున్నట్లుగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులకు భద్రతను పెంచారు.
ఎమ్మెల్యే, ఎంపీలకు అదనపు సెక్యూరిటీస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లిలో ప్రచారం చేస్తున్న సమయంలో గడ్డం రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అయితే ఈ విధంగా ఎంపీ మీద దాడి జరగడంతో వెంటనే ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ స్పందించి.. ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు మరోటి జరగకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతి నిధికి అదనంగా ఇద్దరు గన్‌మెన్లను కేటాయిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు 2+2 భద్రత ఉండగా.. దాడి దృష్ట్యా భద్రతలను 4+4కు పెంచాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్లు, ఎస్పీలకు లేఖ రాశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో నేటి నుంచి బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించనున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ భద్రత పొందుతున్నవారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆగంతుకులెవర్ని ప్రముఖుల దగ్గరకు రానివ్వకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అవసరమైనవారికి అదనంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించాలని.. వారి ఇళ్లు, కార్యాలయాల వద్ద కూడా నిఘా పెంచడంతోపాటు భద్రతా సిబ్బందిని కూడా పెంచాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలాంటి దాడులు జరిగిన సందర్భాలు ఇటీవలి కాలంలో లేవు. వివిధ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నా పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు చర్యలు తీసుకునేవారు. కానీ, ఎంపీ స్థాయి వ్యక్తిపై కత్తితో దాడి చేయడం ఇదే ప్రథమం కావటంతో చర్చనీయాంశంగా మారింది.