సంక్రాంతికి కొత్త బట్టలు కొనివ్వలేదని ఇద్దరు పిల్లలతో తల్లి సూసైడ్

మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది.

By -  Srikanth Gundamalla
Published on : 12 Jan 2024 1:00 PM IST

suicide,  two children,  new clothes,  Sankranti,

సంక్రాంతికి కొత్త బట్టలు కొనివ్వలేదని ఇద్దరు పిల్లలతో తల్లి సూసైడ్

మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండగవేళ ఇంట్లో భర్త కొత్తబట్టలు కొనివ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. కొత్త బట్టల విషయంలో భర్తతో గొడవపడి.. ఇద్దరు పిల్లలతో పాటు తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లింగాల మండలం రాంపూర్‌ చెంచుపేటకు చెందిన బయన్న అనే వ్యక్తి పెద్దవాగు బేస్‌ క్యాంపులో వాచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. చిన్న భార్య నాగమ్మ (26)కి ఇద్దరు పిల్లలు. భయమ్మ (3), యాదమ్మ ఏడాది వయసు. భార్య నాగమ్మ సంక్రాంతి పండగ కోసం కొత్త బట్టలు కొనివ్వాలని భర్తకు చెప్పింది. అయితే.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భర్త కుదరదని చెప్పాడు. గత నాలుగు నెలలుగా జీతం రాలేదని తర్వాత తీసుకోవాలని కోరాడు. అయితే.. ఈ విషయంలోనే భర్తతో నాగమ్మ గురువారం ఉదయం గొడవపడింది.

ఇక చిన్నభార్య ఊరికే వేధిస్తోందనీ.. డబ్బులు లేవని చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన భర్త మన్ననూర్‌కు వెళ్లాడు. అంతలోనే నాగమ్మ తన ఇద్దరు ఆడపిల్లలను ఇంట్లోనే గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇంట్లో నుంచి పిల్లలు, తల్లి బయటకు రావడం లేదని అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఉరివేసుకుని తల్లి చనిపోగా.. పిల్లలు నేలపై చనిపోయి ఉన్నారు. ఈ సమాచారాన్ని మన్ననూర్‌లో ఉన్న భర్తకు చెప్పారు. గ్రామానికి చేరుకున్న భర్త బయన్న భార్య, బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story