అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలి: కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

By Srikanth Gundamalla
Published on : 3 Sept 2023 9:30 PM IST

MLC Kavitha, Assembly Election, Singareni region,

 అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలి: కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివారం హైదరాబాదులో కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తప్పించారని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కాపాడారని చెప్పారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదన్నారు కవిత. అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను కల్పించారని కవిత చెప్పారు. అదే రకంగా సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. తాను కూడా చొరవ తీసుకొని సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి సహా టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story