స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌ రాలేదని ఏడ్చేసిన రాజయ్య

అధిష్టానం తనకు ఈ సారి టికెట్‌ ఇవ్వకపోవడంతో రాజయ్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 4:05 PM IST
MLA Rajaiah, Cry,  BRS Ticket, CM KCR,

 స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌ రాలేదని ఏడ్చేసిన రాజయ్య

బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 95 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించారు. కానీ.. ఏడు స్థానాల్లో మాత్రమే మార్పులు చేశారు. దాంతో.. ఆ ఏడుగురిలోనే కొందరు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. కొందరు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ వారిలో స్టేషన్‌ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. అయితే.. అధిష్టానం తనకు ఈ సారి టికెట్‌ ఇవ్వకపోవడంతో రాజయ్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం తన మద్దతుదారులతో సమావేశం అయ్యారు. తనకు టికెట్‌ రానందుకు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మనోవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. జనగామలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వర్షంలోనే తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేశారు తాటికొండ రాజయ్య. అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్లపై పడుకుని విలపించారు. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన కార్యకర్తలను పట్టుకుని ఏడ్చేశారు. అందరూ సంయమనం కోల్పోవద్దని.. ఓపికతో పనిచేయాలని తన మద్దతుదారులకు తాటికొండ రాజయ్య సూచించారు. కార్యకర్తలంతా ఎన్నికల కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు తాటికొండ రాజయ్య.

కేసీఆర్‌ అంటే తనకు ఎంతో అభిమానమని.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రమ్మంటే ఆయన వచ్చినట్లు రాజయ్య చెప్పారు. స్థాయికి తగిన అవకాశం కల్పిస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని తెలిపారు. అధినాయకత్వం ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్‌ పార్టీలో పనిచేద్దామని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ,నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లుగా ఏ పనిచెప్పినా తూచా తప్పకుండా చేస్తానని మరోసారి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు చోటు దక్కలేదు. ఆయన స్థానంలో కడియం శ్రీహరి పేరును ప్రకటించారు సీఎం కేసీఆర్. టికెట్ ఆశించిన రాజయ్యకు భంగపాటు తప్పలేదు. అయితే.. ఎవరూ చిన్నబుచ్చుకోవద్దని..రానున్న రోజుల్లో పదవులు ఇవ్వాల్సినవి ఉంటాయని.. తప్పకుండా న్యాయం చేస్తానని కేసీఆర్ చెప్పడంతో ఆయన మాటను కొందరు నేతలు నమ్ముతున్నారు.

Next Story