పటాన్‌చెరు ఎమ్మెల్యే పెద్దకుమారుడు గుండెపోటుతో మృతి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు.

By Srikanth Gundamalla  Published on  27 July 2023 11:41 AM IST
MLA, Mahipal Reddy, Son Dead, Heart stroke,

 పటాన్‌చెరు ఎమ్మెల్యే పెద్దకుమారుడు గుండెపోటుతో మృతి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మరణించారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. దాంతో విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు.

కిడ్నీలు పాడవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు. దీనికోసం చికిత్స పొందుతుండగానే కామెర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైద్యులు విష్ణువర్ధన్‌రెడ్డికి డయాలసిస్‌ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. కొన్నాళ్లుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. అలా వెంటిలెటర్‌పైన ఉండగానే తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసానికి తరలించారు. పెద్దకుమారు మరణించడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

విష్ణువర్ధన్ రెడ్డి పార్థీవ దేహాన్ని సందర్శించి మంత్రులు మంత్రి హరీశ్ రావు, ఎర్రవెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు . విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.


Next Story