కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 8:04 AM GMTకొత్త రేషన్‌కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్, సామర్థ్యం, బియ్యం నాణత్యపై అధికారులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి వివరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. గత పాలకుల వల్ల పౌరసరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయని అన్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణలో పౌర సరఫరాల శాఖ రూ.56వేల కోట్ల నష్టంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో చాలా కాలంగా రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 12 శాతం మంది వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించలేదు అని చెప్పారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని ఉత్తమ్ అన్నారు. పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినేవిధంగా ఉండాలి తప్ప మరోవిధంగా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో బియ్యం లబ్దిదారుల నుంచి రాండం చెక్ చెయ్యాలనీ... ప్రజల నుంచి సమాచారం సేకరించాలి అని ఉత్తమ్ అన్నారు. ఇక మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించామని.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
యాసంగి, వర్షాకాలంలో ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. అవినీతికి తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. వంద రోజుల్లో గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందబోతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి.