మంగళవారం మరదలు అంటూ.. వైఎస్ షర్మిలపై వివాదాస్పద వ్యాఖ్యలు
Minister Niranjan Reddy fires on YS Sharmila.వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో
By M.S.R Published on 28 Oct 2021 1:55 PM ISTవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..! ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రజల కష్టాలు వింటానని చెప్పిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలనూ ఆమె కొనసాగిస్తున్నారు.
ఆమెపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలనుద్దేశించి మంగళవారం మరదలు బయల్దేరిందంటూ కామెంట్ చేశారు. 'రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరింది'' అంటూ వ్యాఖ్యానించారు. ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు.
ఇక తన పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను కబ్జా చేసినట్లు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని వారి నుంచి విముక్తి కల్గించాల్సిన అవసరముందని వైఎస్ షర్మిల అన్నారు. పాదయాత్రలో భాగంగా మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలనేది రైతుకు తెలుసని ఏ పంట సాగు చేయాలనేది కూడా పాలకులు చెప్పడం రైతు స్వేచ్ఛను హరించడమేనని విమర్శించారు.