హైదరాబాద్ ఓటర్లంతా బయటకొచ్చి ఓటు వేయండి: మంత్రి కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 10:24 AM ISTహైదరాబాద్ ఓటర్లంతా బయటకొచ్చి ఓటు వేయండి: మంత్రి కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు చెబుతున్నారు. అందులో భాగంగానే తామే ముందుగా ఓటు వేస్తున్నారు. హైదరాబాద్ బంజరాహిల్స్‌లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం.. మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్క ఓటరు బయటకు రావాలని.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అభివృద్ధి కోసం పాటుపడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు కేటీఆర్. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ అన్న కేటీఆర్.. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్‌కు రావడం లేదని అన్నారు. అందరూ బయటకు వచ్చి తమకు నచ్చిన పార్టీకి, నచ్చిన నాయకుడికి ఓటు వేయాలన్నారు కేటీఆర్. పట్టణాలు, నగరాల్లో విద్యావంతులు ఎక్కువగా ఉంటారని.. కానీ వారే ఓటింగ్‌కు దూరంగా ఉండటం మంచిది కాదన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువ ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. విద్యావంతులు అంతా తమ బాధ్యతను నిర్వర్తించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ దంపతులు. #KTR #TelanganaElection2023 pic.twitter.com/tCoeVB8Mqv
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 30, 2023