సుఖేష్ ఎవరో కూడా తెలియదు.. ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్
సుఖేష్ ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
By Srikanth Gundamalla Published on 14 July 2023 5:09 PM ISTసుఖేష్ ఎవరో కూడా తెలియదు.. ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ గవర్నర్‌కు మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ గురించి తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశాడు సుఖేష్. తన వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని ఆధారాలను ఇవ్వాలని అడుగుతున్నారని ఆరోపించాడు సుఖేష్. ఆధారాలను ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు కూడా ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని గవర్నర్ తమిళిసైకి రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించాడు.
తన వద్ద ఎమ్మెల్సీ కవితకు సంబంధించి రూ.2వేల కోట్లకు పైగా లావాదేవీలపై ఆధారాలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పాడు. అంతేకాదు తనకు, ఎమ్మెల్సీ కవిత మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపాడు. అయితే.. ఈ ఆధారాలన్నీ ఇప్పటికే ఈడీకి 65-బీ సర్టిఫికెట్ రూపంలో సమర్పించానని అన్నాడు. కవిత నుంచి రూ.15 కోట్లు తీసుకుని కేజ్రీవాల్ తరఫు వారికి ఇచ్చినట్లు పేర్కొన్నాడు సుఖేష్. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కూడా కోరుతున్నట్లు తెలిపాడు.
ఇక సుఖేష్ ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ఆరోపణలను కొట్టిపారేశారు. నేరస్థుడు, మోసగాడు తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని అన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తాను ఎప్పుడూ వినలేదని.. వాడెవడో కూడా తనకు తెలియదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. సుఖేష్ అనే పోకిరీ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుఖేష్ లాంటి ఒక మోసగాడు ఆరోపణలు చేసినప్పుడు వాటిని ప్రసారం చేసే ముందు మీడియా వారు కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.