కోడి కూర, బగార వండిన కేటీఆర్.. నెట్టింట వీడియో వైరల్

కేటీఆర్ స్వయంగా నాటు కోడి కూర వండి.. పచ్చటి పొలాల మధ్య దావత్‌ చేసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 10:30 AM IST
minister ktr, cooking, my village show, youtube,

 కోడి కూడ, బగార వండిన కేటీఆర్.. నెట్టింట వీడియో వైరల్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో హీట్‌ పెరిగింది. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. వరుస సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. ఈసారైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి తాము అధికారం చేపట్టాలని ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే.. ఎన్నికల సమరం ఒకవైపు నడుస్తోంటే మరోవైపు కేసీఆర్ రూటు మార్చారు. కాస్త వినూత్నంగా ఆలోచించి ప్రజల మధ్య నుంచి సోషల్‌ మీడియాకు వచ్చారు. తెలంగాణ యాసతో సోషల్‌ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ‘మై విలేజ్ షో’ టీమ్‌తో ఓ ప్రోగ్రామ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ స్వయంగా నాటు కోడి కూర వండి.. పచ్చటి పొలాల మధ్య దావత్‌ చేసుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ తనకు సంబంధించిన కొన్ని విషయాలను గంగవ్వ అండ్‌ టీమ్‌తో షేర్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

కరీంనగర్‌లో ఓ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. అక్కడే మై విలేజ్‌ షో బృందం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. తమతో ఓ ప్రోగ్రామ్‌ చేయాలంటూ విన్నవించింది. దాంతో.. మంత్రి కేటీఆర్‌ కూడా సరే అన్నారు. ఏదో ఒకరోజు వస్తానంటూ సభా వేదికగానే గంగవ్వకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ మై విలేజ్‌ షోలో పాల్గొన్నారు. స్వయంగా కోడి కూర, బగార, గుడాలు వండారు. ఆ తర్వాత గంగవ్వతో పాటు ఆ షో బృందంతో ముచ్చట్లు పెట్టారు.

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్, గంగవ్వ మధ్య ముచ్చట్లు నవ్వులు పూయించాయి. ఏమనుకోవద్దు అంటూనే కేటీఆర్‌ను గంగవ్వ ప్రశ్నలు అడిగేసింది. కేసీఆర్‌తో ఎప్పుడైనా గొడవలు అయ్యాయా అని ప్రశ్నించగా.. గొడవలు జరగని ఇల్లు ఉండదని..వాళ్లకు కూడా జరిగాయని కేటీఆర్ చెప్పారు. ఇక కేసీఆర్‌ను మీరేమని పిలుస్తారని గంగవ్వ కేటీఆర్‌ను అడిగింది. దానికి.. బయట అయితే సార్ అని పిలుస్తానని.. ఇంట్లో డాడీ అని పిలుస్తానని మంత్రి కేటీఆర్ చెప్పారు. అలా మాట్లాడుతూనే టమాటాలు కట్‌ చేశారు. అమెరికాలో ఉన్నప్పుడు తన వంట తానే చేసుకునేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఏ కూర బాగా వండుతారంటూ అంజిమామ అడగ్గా.. అన్ని బాగానే చేస్తానని.. కానీ తినేవాళ్ల మీద ఆధారపడి ఉంటుందంటూ కేటీఆర్ అందరినీ నవ్వులు పూయించారు. అంతేకాదు.. తన కుటుంబం, ఎమ్మెల్సీ కవితతో అనుంబంధం గురించి కేటీఆర్ చెప్పారు. వంట చేస్తూనే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల గురించే కాకుండా పర్సనల్‌ విషయాలను కూడా మై విలేజ్ షో ద్వారా మంత్రి కేటీఆర్ పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు వినూత్న ప్రచారం చేయడంలో కేటీఆర్‌ను మించిన వారు లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story