చంద్రబాబు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధేసింది: మంత్రి కేటీఆర్
చంద్రబాబు నాయుడు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధ అనిపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 3:01 AM GMTచంద్రబాబు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధేసింది: మంత్రి కేటీఆర్
ఏపీ స్కిల్ డెవపల్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిరసనలు చేశారు పలువురు టీడీపీ నాయకులు.. చంద్రబాబు మద్దతు దారులు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో నిరసనలు చేపట్టొద్దని.. పక్కింటి లొల్లితో మాకేం అవసరమంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో శాంతిభద్రతల దృష్ట్యా తాము పక్క రాష్ట్రంలోని రెండు రాజకీయ పార్టీ మధ్య గొడవకు హైదరాబాద్‌ను వేదిక కానివ్వమని చెప్పారు. అయితే.. మంత్రి కేటీఆర్ చంద్రబాబు అరెస్ట్ గురించి మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధగా అనిపించిందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధ అనిపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక వేళ చంద్రబాబుకి భద్రత కల్పించలేని పరిస్థితి ఉంటే రాజకీయాల్లో అది మంచిది కాదంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కుమారుడిగా లోకేశ్ బాధను అర్థం చేసుకోగలను అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అలాంటి బాధనే తాను అనుభవించానని అన్నారు. ఆ సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కొడుకుగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా అని చెప్పారు. అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తనని హెచ్చరించారని కేటీఆర్ వెల్లడించారు. మీ నాన్న బ్రెయిన్ డెడ్ అవుతారని.. నాలుగు రోజుల్లో చనిపోతారని చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. అందుకే లోకేశ్ బాధపడటం సమంజసమే అని చెప్పారు. తన సానుభూతి ఎప్పుడూ ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే.. ఇది ఏపీలో రెండు పార్టీల తగదా అని మరోసారి అన్నారు. ఒక వేళ హైదరాబాద్‌లో ధర్నాలు చేయాలనుకుంటే ధర్నా చౌక్ ఉందన్నారు. కొట్లాటకు.. ఉద్రిక్త పరిస్థితులకు హైదరాబాద్ వేదిక కాకూడదనే తాము భావిస్తున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్. అయితే.. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.