డీప్‌ ఫేక్ వీడియోలు చేస్తారు.. అలర్ట్‌గా ఉండాలి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుంటంతో ప్రచారం ఊపందుకుంది.

By Srikanth Gundamalla  Published on  24 Nov 2023 11:27 AM IST
minister ktr,  deep fake, campaign, social media,

డీప్‌ ఫేక్ వీడియోలు చేస్తారు.. అలర్ట్‌గా ఉండాలి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుంటంతో ప్రచారం ఊపందుకుంది. ప్రజల్లోకి వెళ్లి ర్యాలీలు, సభల ద్వారానే కాదు.. సోషల్‌ మీడియా ద్వారా ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. మరోవైపు టీవీల్లో యాడ్స్ ద్వారా ప్రజలకు చేసే హామీలపై వివరణ ఇస్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. అయితే.. సోషల్‌ మీడియాలో కొన్ని నిజమైన వార్తలు ఉంటే.. ఇంకొన్ని అసత్యపు ప్రచారాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌ తమ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణ-ప్రత్యారోపణల జోరు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులను, సోషల్‌ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక పోస్టు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొద్ది సమయమే ఉందని చెప్పారు. స్కామ్‌గ్రెస్‌ స్కామర్ల నుంచి రాబోయే కొద్ది రోజుల్లో అనేక తప్పుడు/ డీప్‌ఫేక్‌ వీడియోలు, ఇతర రకాల అసంబద్ధ ప్రచారాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎక్స్‌ ఖాతా ద్వారా మంత్రి కేటీఆర్ తమ పార్టీ నేతలకు సూచించారు.

ఎవరూ మోసపూరిత వలలో చిక్కుకోవద్దని అన్నారు మంత్రి కేటీఆర్. అలాగే తప్పుడు ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూసుకోవాలని అన్నారు. డీప్‌ఫేక్‌ కంటెంట్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చజరుగుతోందన్న కేటీఆర్.. కేంద్రం అలాంటి కంటెంట్‌ వ్యాప్తి కట్టడికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ డీప్‌ ఫేక్‌ వీడియోలు వైరల్ కావొచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story