మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి
మీర్‌పేటలో జరిగిన ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 6:05 PM ISTమీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి
మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితులు ఏకంగా బాలిక ఇంట్లోకి దూరి ఆమె సోదరిడిని బెదిరించి.. అతిని ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే.. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ముగ్గురూ గంజాయి బ్యాచ్ అని.. మత్తులోనే అఘాయిత్యానికి తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు.
మీర్‌పేటలో జరిగిన ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బాలికకు జరిగిన అన్యాయం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజ్‌భవన్ వర్గాల ద్వారా గవర్నర్ తమిళిసై అడిగి తెలుసుకున్నారు. అయితే.. ఈ ఘటన ఎంతో దారుణమైనదని అని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీసీపీ, రాచకొండ సీపీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
ఇక భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ సహా జిల్లా అధికారులు బాధితురాలి ఇంటిని సందర్శించాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పాలన్నారు. నిందితులకు ఎలాగైనా శిక్ష పడేలా చూడాలని.. అలాగే బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి సాయం అందించాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.