Medchal: వర్షం బీభత్సం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం
మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది
By Srikanth Gundamalla Published on 8 May 2024 2:30 AM GMTMedchal: వర్షం బీభత్సం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం
మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నట్లుండి మంగళవారం సాయంత్రం తెలంగాణలోని పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో కొంత మేర ఇబ్బందులు తప్పలేదు. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.. అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే.. మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఒక గోడ కుప్పకూలింది. నిర్మాణం సమీపంలోనే ఉన్న ఏడుగురు శిథిలాల కింద చిక్కుకుని దుర్మరణం చెందారు. స్థానికంగా ఈ సంఘటన విషాదాన్ని నింపింది.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ భవన నిర్మాణాన్ని చేపట్టారు. అందులో పనిచేసే వారి కోసమే ఓ షెడ్‌ను ఏర్పాటు చేశారు. నిర్మాణం జరుగుతున్న భవనం పక్కనే షెడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. మంగళవారం సాయంత్రం నుంచి ఉన్నట్లుండి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దాంతో నిర్మాణంలో ఉన్న భవనం ప్రహారి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. భవన నిర్మాణ కార్మికులు ఉంటోన్న షెడ్‌పై పడిపోయింది. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలను కొనసాగించారు. సహాయక చర్యల్లో జేసీబీలను కూడా ఉపయోగించారు.
శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. చనిపోయిన వారంతా ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఏసీబీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో తిరుపతిరావు మజ్జి (20), శంకర్ (22), రాజు (25), ఖుషి, రామ్ యాదవ్ (34), గీతా( 32), హిమాన్షు (14) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పలువురికి గాయాలు అయ్యాయనీ.. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.