భక్తుల ఇంటికే మేడారం జాతర ప్రసాదం.. ఎలా పొందాలంటే..

తెలంగాణలో జరిగే మేడారం సమ్మక సారాలమ్మ జాతర ఎంతో ప్రత్యేకమైనది.

By Srikanth Gundamalla  Published on  13 Feb 2024 3:00 PM GMT
medaram jatara, prasadam, devotees,  book online,

భక్తుల ఇంటికే మేడారం జాతర ప్రసాదం.. ఎలా పొందాలంటే..

తెలంగాణలో జరిగే మేడారం సమ్మక సారాలమ్మ జాతర ఎంతో ప్రత్యేకమైనది. ఈ గిరిజన జాతర కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. అయితే.. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జాతరకు రాలేని భక్తులు ఇంటి వద్ద నుంచే అమ్మవార్ల ప్రసాదం పొందేలా ఏర్పాట్లు చేశారు. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది.

ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది. మేడారం జాతర ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి 24 వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుక్‌ చేసుకునేలా టీఎస్ ఆర్టీసీ సదుపాయం కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలో ఉన్న టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో లేదంటే పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వద్ద మేడారం జాతర ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. https://rb.gy/q5rj68 సైట్‌ ద్వారా లేదా పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చు.

ఆన్‌లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

Next Story