గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాకాలగూడెం గ్రామానికి చెందిన నాగముత్యం అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 11:30 AM ISTగుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్
పోలీసులు ఎక్కువ శాతం కఠినంగానే కనిపిస్తారు. రోజూ నేరస్థులను డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి.. వారి ప్రవర్తన కొంచెం కఠినంగానే ఉంటుంది. అయినా.. ఆపదలో ఉన్న వారిని రక్షించేందు ఎంతదూరమైనా వెళ్తుంటారు. మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలబడతారు. ఇలా కొందరు పోలీసులు మానవత్వం చాటుకున్న సంఘటనలూ ఉన్నాయి. తాజాగా మేడారం జాతరలో కూడా ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. తద్వారా ప్రజలు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలం పాకాలగూడెం గ్రామానికి చెందిన నాగముత్యం అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. దమ్మాపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. మేడారం జాతరలో భాగంగా నాగముత్యంకు డ్యూటీ పడింది. ఈ క్రమంలోనే అక్కడకు డ్యూటీ కోసం వెళ్లి విధుల్లో పాల్గొన్నారు. అయితే.. ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వచ్చాడు. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్నాడు. ఈ నేపథ్యంలో నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ఉలుకూపలుకు లేదు. దాంతో.. కుటుంబ సభ్యులంతా కంగారుపడిపోయారు. ఏమైందో అర్థం కాలేదు. మిగతా భక్తులు కూడా అతను ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆందోళన చెందారు.
అక్కడే ఉన్న కానిస్టేబుల్ నాగముత్యం ఇదంతా చూశాడు. అతనికి గుండెపోటు వచ్చి కిందపడిపోయాడని గ్రహించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేశాడు. కాసేపటికి అతను మళ్లీ కళ్లు తెరిచేలా చేశాడు. కాసేపటికి కోలుకున్నాక అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. దాంతో.. మరోసారి పునర్జన్మిచ్చాడంటూ అక్కడున్నవారంతా కానిస్టేబుల్ నాగముత్యాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందనీ వైద్యులు కూడా చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ఉన్నతాధికారులు కూడా నాగముత్యాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే.. కానిస్టేబుల్ వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడుతున్న దృశ్యాలను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీశారు.