'ఇక్కడ ఓటు అమ్మబడదు'.. వైరల్ అవుతోన్న ఓ వ్యక్తి ఇంటి వద్ద బ్యానర్
దేశంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసిన నాయకులు ప్రచారాంలో హోరెత్తిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 12:11 PM GMT'ఇక్కడ ఓటు అమ్మబడదు'.. వైరల్ అవుతోన్న ఓ వ్యక్తి ఇంటి వద్ద బ్యానర్
దేశంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసిన నాయకులు ప్రచారాంలో హోరెత్తిస్తున్నారు. ర్యాలీలు, సభలు, బస్సు యాత్రలు.. ఇంటింటి ప్రచారంతో బిజీ అయిపోయారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న చోట్ల డబ్బు ప్రవాహం కూడా బాగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓటును కొనేందుకు నాయకులు ప్రయత్నిస్తుంటారు.
అయితే.. ఎన్నికలు వచ్చిందంటే ఓట్లను కొనేందుకు నాయకులు ప్రయత్నాలు చేయడం కామన్‌గా జరుగుతుండేదే. ఓటర్లు కూడా వారి వద్ద డబ్బు తీసుకుని పోలింగ్ బూత్‌కి వెళ్తారు. కానీ.. ఎక్కడో కొందరు మాత్రమే డబ్బులు తీసుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కూడా ఓ వ్యక్తి ఓటుని అమ్ముకునేందుకు దూరంగా ఉన్నాడు. అంతేకాదు.. తనలానే మిగతావారు కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవాలనీ.. అమ్ముకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగించుకోవాలని తాపత్రయపడ్డాడు. ఈ క్రమంలోనే తన గేటుకు ఒక బ్యానర్‌ను ఏర్పాటు చేశాడు. ఈ బ్యానర్‌ను చదవిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
సదురు వ్యక్తి తన ఇంటి ముందు గేటు వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్‌లో ఇలా రాసుకొచ్చాడు.. తలరాతను మార్చగల ఏకైక ఆయుధం ఓటు.. నా ఓటుని కొనగలిగినంత ధనవంతుడు ఈ రాష్ట్రంలోనే లేడు.. ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. అంటూ మంచి మెసేజ్ ఉన్న బ్యానర్‌ను ఇంటి ముందు ఏర్పాటు చేశాడు. ఈ బ్యానర్‌ను చూసిన స్థానిక ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. ఏదీ ఏమైనా ఓటును అమ్ముకోకుండా మంచి చేస్తాడనే నమ్మకమున్న నాయకుడికి వేస్తే మున్ముందు భవిష్యత్‌లో మంచి జరుగుతుందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.