Drugs Case: నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. నవదీప్ ఇంట్లో నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 12:04 PM ISTDrugs Case: నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ను నిందితుడిగా పేర్కొన్నారు నార్కొటిక్స్ బ్యూరో అధికారులు. ఈ క్రమంలో నవదీప్‌ను 37వ నిందితుడిగా పేర్కొన్నారు. పోలీసుల సోదాల్లో పట్టుబడ్డ రామ్‌చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నవదీప్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్లు పోలీసులకు రామ్‌చంద్ తెలిపాడు. దాంతో.. నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు నవదీప్ డ్రగ్స్ సేవించినట్లు పేర్కొంటూ నిందితుడిగా చేర్చారు.
కాగా.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ నవదీప్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో.. ఆయన వెంటనే కోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు మరో అడుగు వేశారు. నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీనే నవదీప్ ఇంట్లో నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారని వెలుగులోకి వచ్చింది. అయితే.. సోదాల సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం.
ఆగస్టు 31న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నవదీప్ ను కూడా అరెస్ట్ చేసి విచారించాలనే యోచనలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఉన్నారు. ఈ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ బ్యూరో 13 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.