లోక్‌సభ ఎన్నికల వేళ ప్రత్యేక బస్సులను నడపనున్న TSRTC
తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By Srikanth Gundamalla Published on 10 May 2024 4:14 PM ISTలోక్‌సభ ఎన్నికల వేళ ప్రత్యేక బస్సులను నడపనున్న TSRTC
తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటించింది. మిగతా నియోజకవర్గాల్లో అన్ని చోట్లా పకడ్బందీగా పోలింగ్‌ను నిర్వహించేందుకు చర్యలను తీసుకుంటోంది. మరోవైపు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించారు. ఇక తాజాగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని తెలంగాణ ఆర్టీసీ సంస్థ అడుగు ముందుకు వేసింది.
ఈ నెల 13వ తేదీన పోలింగ్ సందర్భంగా చాలా మంది ఓటర్లు నగరం నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. దాంతో.. ప్రయాణ ఇబ్బందులు పడకుండా సమయానికి.. సుఖంగా తమ సొంత స్థలాలకు చేరేలా టీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపున్నట్లు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు, పట్టణాలకు 2వేల వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఎంజీబీఎస్ నుంచి 500 బస్సులు, జేబీఎస్ నుంచి 200 బస్సులు, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 10వ తో పాటు రేపు, ఎల్లుండి కూడా అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు అధికారులు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.