గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 4:56 PM ISTగద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఎన్నికల వేళ ఆయన తప్పుడు పత్రాలు సమర్పించారని.. డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. అంతేకాదు.. ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. దాంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కృష్ణమోహన్‌రెడ్డి పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇక తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దాంతో.. బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లు అయ్యింది.
కాగా.. తెలంగాణ హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు గెజిట్ విడుదల చేయాలని సూచనలు కూడా చేసింది. అంతేకాదు.. తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించడంతో డీకే అరుణ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. అయితే.. తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాతే జరగనుంది.