కొత్త ప్రభాకర్‌రెడ్డి హెల్త్‌ బులెటిన్, ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు

ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి మరో నాలుగు రోజుల పాటు అందులోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 3:55 PM IST
kotha prabhakar reddy, health bulletin, yashoda hospital,

కొత్త ప్రభాకర్‌రెడ్డి హెల్త్‌ బులెటిన్, ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు

సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మూడు గంటల పాటు శ్రమించి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు వైద్యులు. చిన్న పేగును వైద్యులు 10 సెంటీమీటర్ల మేర తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి మరో నాలుగు రోజుల పాటు అందులోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు.

కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. హత్యాయత్నం కేసును సిద్దిపేట పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ దాడి రాజకీయ హత్యాయత్నంగానే బీఆర్ఎస్‌ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ఆరోపణల చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక దాడికి పాల్పడ్డ రాజుని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించారు. నిందితుడి కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఎంపీపై దాడి తర్వాత రాజుపై బీఆర్ఎస్‌ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు. దాంతో.. అతడు గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇక కొత్త ప్రభాకర్‌రెడ్డి హెల్త్‌ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమన్నారు. ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఐసీయూలో ఐదు రోజుల పాటు చికిత్స అందిస్తామని.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు ఉన్నాయని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Next Story