పోటీ పరీక్షల్లో అవకతవకలకు కర్ణాటకలో కఠిన శిక్షలు.. మరి తెలంగాణలో?
తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 7:39 AM ISTపోటీ పరీక్షల్లో అవకతవకలకు కర్ణాటకలో కఠిన శిక్షలు.. మరి తెలంగాణలో?
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపడతామని బీఆర్‌ఎస్ ఆశాభంగానికి గురైంది. అయితే.. రాష్ట్రంలో అధికారపార్టీపై కొంతమేర వ్యతిరేకత రావడానికి నిరుద్యోగం ఒకకీలకమైన అంశంగా ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. అంతేకాదు.. తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. కర్ణాటక ప్రభుత్వం ఈ తరుణంలోనే ఓ బిల్లును తీసుకొచ్చింది. కఠిన శిక్షలు.. జరిమానా ఉండేలా ఆ బిల్లు అమలు కానుంది. ఇదే బిల్లుపై తెలంగాణ ప్రజల దృష్టి పడింది.
ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడకుండా కర్ణాటకలోని సిద్ధారామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కఠినమైన చట్టం తీసుకురావాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డా, అక్రమాలు చేసినా.. నేరం నిరూపితం అయితే పదేళ్లు జైలు శిక్షతో పాటు, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించాలని బిల్లును రూపొందించారు. ఈ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు-2023గా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సహా స్వయం ప్రతిపత్తి సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో భర్తీ కోసం నిర్వహించే పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ, భర్తీ ప్రక్రియలో అక్రమ మార్గాలను ఎంచుకోవడం, అవకతకవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
తెలంగాణలో ప్రశ్నా పత్రాల లీకేజీల వ్యవహారం కొంతకాలం ముందు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షల అభ్యర్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వ వైఫల్యమే అంటూ నిరసనలు చేశారు. ఇదే అంశం బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకొచ్చిన బిల్లుపై తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో.. అలాంటి బిల్లునే ఇక్కడా తీసుకొస్తుందా? అనే చర్చ మొదలైంది. కొందరు నిరుద్యోగులు అయితే.. ఇలాంటి చట్టం తీసుకురావడం మంచిదనీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.