మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జి కుంగిన ఘటనపై కేంద్ర కమిటీ ఏర్పాటు
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 9:29 AM GMTమేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జి కుంగిన ఘటనపై కేంద్ర కమిటీ ఏర్పాటు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జి శనివారం కుంగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలే ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని.. కేసీఆర్ ప్రభుత్వం వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపించిందని చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ.. హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత మేడిగడ్డ జలాశయాన్ని మంగళవారం (అక్టోబర్ 23న) పరిశీలిస్తారు. అనంతరం నివేదికను సిద్ధం చేసి ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు అందించనుంది.
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దాని ప్రభావంతో 20 నెంబరు పిల్లరుకు ఇరువైపులా బ్యారేజీ వంతెన కుంగింది. ఈ క్రమంలో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. నితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. కాగా.. పిల్లరు కుంగిపోవడానికి గల కారణాలు పూర్తిస్థాయి విచారణ తర్వాతే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.