జీరో టికెట్‌పై కండక్టర్ల చేతివాటం..ఇక ఆర్టీసీ అధికారుల తనిఖీలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 11:59 AM ISTజీరో టికెట్‌పై కండక్టర్ల చేతివాటం..ఇక ఆర్టీసీ అధికారుల తనిఖీలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండింటిన అమలు చేస్తోంది. అందులో ఒకటైన మహాలక్ష్మి పథకానికి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఈ పథకం కింద తెలంగాణ మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఇందులో భాగంగా.. స్థానికతను చూపించిన తర్వాత మహిళలకు కండక్టర్లు జీరో టికెట్ జారీ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
అయితే.. ఇక్కడే కండక్టర్లు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. ఎక్కువ మంది ప్రరయాణికులను తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. దాంతో.. కొందరు కండక్టర్లు తమ తెలివిని ప్రదర్శిస్తున్నారు. కొన్ని బస్సుల్లో మహిళలు ఉన్నదానికంటే ఎక్కువ జీరో టికెట్లు కొడుతున్నారు. ఇంకొందరు దిగాల్సిన స్టాప్ కంటే ఎక్కువ దూరం టికెట్లను ఇస్తున్నారు. ఎందుకు ఇలా ఇస్తున్నారు అని అడిగితే.. మీరేం డబ్బులు ఇవ్వడం లేదు కదా అని సమాధానం ఇస్తున్నారట కండక్టర్లు. ఏదైతేనేం తాము కూడా సైలెంట్‌గా టికెట్ తీసుకుని ఉండిపోతున్నారు మహిళలు. ఎక్కువ మందిని తీసుకెళ్లినట్లు చూపించడానికే కదా అనుకుంటూ నిట్టూరుస్తున్నారు.
ఇలాంటి విషయాలన్నీ ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం దీనిపై చర్యలకు సిద్దం అవుతోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో తనిఖీలకు సిద్ధం అవుతున్నారు. ఇష్టానుసారం జీరో టికెట్లు జారీ చేసి ప్రయాణికులు పెరిగినట్లు చూపించడం సరికాదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ మొత్తాన్ని భారీగా పొందాలనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో.. యాజమాన్యంపై ఇలాంటి ఆరోపణలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు లేకుండా జీరో టికెట్ జారీ చేసినా.. ప్రయాణించే దూరం కంటే ఎక్కువ దూరానికి టికెట్ ఇచ్చినా చర్యలు తీసుకుంటామని గ్రేటర్ జోన్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు డీఎంలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.