మటన్ విషయంలో భార్యతో గొడవ.. చెరువులో దూకిన భర్త, చివరకు..
దంపతులు మధ్య గొడవలు సహజం. చిన్న చిన్న కారణాలతో ఘర్షణలు పడుతుంటారు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 11:00 AM ISTమటన్ విషయంలో భార్యతో గొడవ.. చెరువులో దూకిన భర్త, చివరకు..
దంపతులు మధ్య గొడవలు సహజం. చిన్న చిన్న కారణాలతో ఘర్షణలు పడుతుంటారు. ఆ తర్వాత సర్దుకుని పోతారు. ఇవన్నీ అందరి ఇళ్లలో జరిగేదే. అయితే.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఇద్దరు దంపతుల మధ్య జరిగిన గొడవ భర్త ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్లింది. మటన్ విషయంలో గొడవ పడ్డారు భార్య భర్తలు. దాంతో.. విసిగెత్తిన భర్త చచ్చిపోతా అంటూ చెరువులో దూకి చనిపోయేందుకు ప్రయత్నించాడు.
బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్‌లో సాయిని నరేశ్, రాణి దంపతులు నివాసం ఉంటున్నారు. నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. రాణి కూలీగా పనిచేస్తూ సంసారాన్ని లాక్కొస్తున్నారు. అయితే.. ఇటీవల ఆదివారం భర్త నరేశ్ మటన్ తీసుకొచ్చేందుకు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు. భార్య రాణి మాంసం అవసరం లేదనీ.. ఆ డబ్బులతో ఇంట్లో సామాన్లు తీసుకుందామని చెప్పింది. మటన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి.. గొడవ పెద్దది అయ్యింది. భార్య తన మాట వినడం లేదన్న కోపంతో నరేశ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తాను చనిపోవాలని డిసైడ్ అయ్యాడు . క్షణికావేశంలోనే బాచుపల్లిలోని భైరుని చెరువు వద్దకు వెళ్లాడు.
అతనికి ఈత వచ్చు.. దాంతో బతికి వస్తానని ఎలాగైనా నీటిలో మునిగిపోవాలని నడుంకి బండరాయి కట్టుకుని చెరువులో దూకాడు. అయితే.. ఇదంతా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు నరేశ్‌ను సేఫ్‌గా బయటకు తీసుకచ్చారు. నరేశ్ ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత నరేశ్, రాణి దంపతులకు ఎస్‌ఐ జి.సంధ్య పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. స్థానికంగా ఈ సంఘటన చర్చనీయాంశం అయ్యింది.