పండగపూట విషాదం.. నీటమునిగి నలుగురు యువకులు మృతి
రంగుల హోలీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుండగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 March 2024 5:45 PM ISTపండగపూట విషాదం.. నీటమునిగి నలుగురు యువకులు మృతి
రంగుల హోలీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుండగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు యువకులు వార్దానదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. యువకులు విగతజీవులుగా మారడంతో నలుగురి కుటుంబాల్లో పండగపూట విషాదచాయలు అలుముకున్నాయి.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి దగ్గర ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నదీమబాద్‌కు చెందిన కమలాకర్ (22), సంతోష్ (25), ప్రవీణ్ (23), సాయి (22) నలుగురు యువకులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇక హోలీ సంబరాల తర్వాత ఒంటిపై ఉన్న రంగులను పోగొట్టుకునేందుకు స్నానం చేయాలని అనుకున్నారు. నలుగురూ కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. వార్దా నదిలో ఈత కొట్టి స్నానాలు చేయాలని అనుకున్నారు.
నలుగురు స్నానం కోసం నదిలోకి దిగారు. ఇక ఉన్నట్లుండి ఒకరితర్వాత ఒకరు నది నీటిలో మునిగిపోయారు. కాసేపటికి అక్కడే ఉన్న మరికొందరు గట్టుపై ఉన్న చెప్పులు, దుస్తులను చూసి ఎవరో మునిగిపోయారని వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా రెస్క్యూ టీమ్‌తో కలిసి సంఘటనాస్థలానికి వెళ్లారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చాలా సమయంపాటు వెతకిన తర్వాత నలుగురు యువకుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ నలుగురు యువకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో .. వారు అక్కడకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. పండుగ వేళ ఒకే రోజుల నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.