ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు
ఆశా వర్కర్లు చాలా కష్టపడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. వారి సెల్‌ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుందని తెలిపారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 1:23 PM ISTఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు ఆశావర్కర్లకు తీయని కబురు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు చాలా కష్టపడుతున్నారని అన్నారు. వారి కృషి, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ సందర్భంగా వారి సెల్ ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో ఉన్న ఆశా వర్కర్లే ఎక్కువ జీతం అందుకుంటున్నారని చెప్పారు మంత్రి హరీశ్‌రావు. అంతేకాదు.. ఇక నుంచి వారికి ఫోన్ బిల్లుల భారం కూడా తగ్గించనున్నట్లు తెలిపారు. అయితే.. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరు చాలా మెరుగుపడిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ప్రసవం కోసం చాలా వరకు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లేవారిని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారని హరీశ్‌రావు చెప్పారు. దీనికి కారణం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్పించిన సదుపాయాలే అని అన్నారు. దీనికి తోడు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యులు ఆస్పత్రి సిబ్బంది కృషితో పరిస్థితి రివర్స్ అయ్యిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం డెలివరీలు జరుగుతున్నాయని హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుతో ప్రయివేట్ ఆస్పత్రులు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి తదితర ప్రభుత్వ పథకాలతో ప్రయివేటు ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మరింత కష్టపడి పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. ఆశావర్కర్ల సెల్‌ఫోన్ బిల్లులను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ అన్నారు. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని కూడా సర్కారు నిర్ణయించిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. జననం నుంచి మరణం వరకు వైద్య, ఆరోగ్యశాఖ సేవలు అందిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. తమ మంత్రిత్వ శాఖను నీతి ఆయోగ్ సైతం అభినందించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.