హాకీంపేటలో TSRTC ఐటీఐ కొత్త కళాశాల, తరగతులు ఎప్పట్నుంచి అంటే..

ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త.

By Srikanth Gundamalla  Published on  5 Oct 2023 2:30 PM IST
Hakimpet, TSRTC, ITI New College, MD Sajjanar ,

 హాకీంపేటలో TSRTC ఐటీఐ కొత్త కళాశాల, తరగతులు ఎప్పట్నుంచి అంటే..

ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(టీఎస్ఆర్టీసీ) ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించి, తరగతులను నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.

10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోగా iti.telangana.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోంది.

తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్, హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది అని మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని సంస్థ ప్రారంభించిందని చెప్పారు. తాజాగా హాకీంపేట ఐటీఐ కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. ఆ కళాశాలలో ఈ ఏడాది నుంచి మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కొత్త కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే సంస్థ తరగతులను నిర్వహిస్తుందని సజ్జనార్ చెప్పారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అయితే.. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం కోసం 9100664452 ఫోన్ నంబర్ ని సంప్రదించాలని ఆయన సూచించారు.

Next Story