హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం

హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 12:09 PM GMT
hakimpet, sports school, harikrishna, harassment case,

హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం

తెలంగాణలోని హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలపై ఓఎస్డీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. మీడియా కథనాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందిస్తూ.. ఓఎస్డీ హరికృష్ట అధికారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటించారు. అంతేకాదక.. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఓఎస్డీ హరికృష్ట బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అంశంపై ముందుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ వార్త తనను ఎంతో కలచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆమె మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని కోరారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాలికలకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. వెంటనే అధికారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో మహిళ రక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని.. షీటీమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పారు. క్రీడాకారిణిలకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్‌ చేశారు. ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనంపై చర్యలను చేపట్టామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై వాస్తవాలను నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ విచారణ చేపట్టింది. దాదాపు ఏడు గంటలపాటు జరిపిన ఈ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను ప్రశ్నించారు. అలాగే మిగతా ఉపాధ్యాయులను కూడా విచారించారు. విద్యార్థినుల అంతర్గత అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వారికి తెల్లకాగితాలు ఇచ్చి ఘటనపై తమ అభిప్రాయాలను రాసివ్వాల్సిందిగా సూచించారు. వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. కాగా.. ఇంకా విచారణ జరగాల్సి ఉందని.. కొంత సమయం పడుతుందని విచారణ కమిటీ సభ్యులు తెలిపారు.

కాగా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలను స్పోర్ట్స్‌ స్కూల్‌ మాజీ ఓఎస్డీ హరికృష్ణ ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆధారాలు లేకున్నా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను విచారణను ఎదుర్కొంటానని.. తప్పు చేయలేదు కాబట్టి తనకు ఎలాంటి భయం లేదని చెప్పాడు. విచారణ తర్వాత అందరికీ వాస్తవాలేంటో తెలుస్తాయని అన్నారు. తప్పు చేసినట్లుగా రుజువు అయితే ఏ శిక్ష విధించినా సిద్ధమని హరికృష్ణ అన్నాడు. అయితే.. విచారణ తర్వాత సస్పెండ్ చేస్తే బాగుండేదని.. వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలితే జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. తమ కుటుంబం పరువు పోయిందంటూ హరికృష్ణ, ఆయన భార్య వాపోయారు.

ఓఎస్డీ పదవి పోవడంతో హరికృష్ణ స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి వెళ్లిపోతుండగా ఊహించని ఘటన జరిగింది. కొందరు విద్యార్థులు ఆయన కారుని అడ్డుకున్నారు. తమను వదిలిపెట్టి వెళ్లొద్దని కన్నీరు పెట్టుకున్నారు. హరికృష్ణ తమకు తండ్రి లాంటివారని.. ఆయనపై ఆరోపణలు రావడం బాధగా ఉందని పలువురు విద్యార్థులు చెప్పారు. దాంతో.. ఆయన వేధింపులకు పాల్పడ్డారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. విచారణ కమిటీ ఇచ్చే నివేదికే నిజానిజాలను తేల్చనుంది.

Next Story