రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతి

దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి ఆటోలకు అనుమతి లభించింది.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 4:57 PM IST
green flag,  autos, yadadri temple hill ,

 రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతి 

యాదాద్రిలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఇక నుంచి కొండమీదకు ఆటోలను అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక వాటిని ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి ఆటోలకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కలెక్టర్, డీసీపీ, ఆలయ ఈవో పాల్గొన్నారు. అధికారులను ఎమ్మెల్యే ఐలయ్య ఆటో ఎక్కించుకుని స్వయంగా నడిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయం యాదాద్రి స్థానిక ఆటో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి తాము పోరాటం చేస్తున్నామనీ..కాంగ్రెస్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత పాలకులు రెండేళ్ల పాటు ఆటో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. ఇప్పుడేమో వారి గురించి దొంగ ఏడుపు ఏడుస్తున్నారని అన్నారు. యాదాద్రి అభివృద్ధిలో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఐలయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని తాను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాననీ.. విచారణ జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు.

కాగా.. యాదగిరిగుట్ట ప్రధానాలయం రీఓపెన్ సందర్భంగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించింది. దాంతో.. ఆటో డ్రైవర్లు నిరాహార దీక్షకు దిగారు. ఘాట్‌ రోడ్డు దగ్గర యాదరుషి విగ్రహం వద్ద 20 నెలల పాటు దీక్షలు కొనసాగించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ తర్వాత పోలీసుల సూచనతో 2023 నవంబర్‌లో దీక్షలు విరమించారు. ఇక ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన ఐలయ్య ఈ విషయంపై అధికారులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు. ఇక ప్రభుత్వం కూడా అధికారులతో చర్చలు జరిపి ఫిబ్రవరి 11 నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story