మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.

By Srikanth Gundamalla  Published on  9 Jan 2024 2:25 PM IST
Govt order, vigilance inquiry,  Medigadda barrage, collapse,

  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది. గతంలో మంత్రులు మేడిగడ్డ బ్యారేజ్‌ వద్దకు వెళ్లి పరిశీలించిన విషయం తెలిసిందే. తాజాగా.. మంగళవారం బ్యారేజీ కుంగుబాటు సంఘటనపై విజిలెన్స్‌ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. జలసౌలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్‌రావు ఆఫీసులో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తోలో విజిలెన్స్ బృందాలు సోదాలు చేశాయి.

సోమవారం ఇరిగేషన్‌ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కంప్యూటర్‌తో పాటు పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్‌ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పందించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేంటో తేల్చాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హైదరాబాద్‌తో పాటు.. జిల్లా ఇరిగేషన్‌ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో సోదాలు కొనసాగించారు. మహదేవపూర్‌లోని ఇరిగేషన్‌ డివిజన్‌ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ లకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ విధంగా మొత్తం 12 చోట్ల 10 విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందాలతో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో రికార్డులను అక్కడున్న ముఖ్యమైన పత్రాలను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తెలుసుకోవడమే కాకుండా అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించే పనిలో విజిలెన్స్ అధికారులు నిమగ్నమయ్యారు.

Next Story