గవర్నర్ ప్రభుత్వానికి మధ్య పెరిగిన గ్యాప్

By -  Nellutla Kavitha |  Published on  5 March 2022 4:11 PM GMT
గవర్నర్ ప్రభుత్వానికి మధ్య పెరిగిన గ్యాప్

సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై రాష్ట్ర గవర్నర్ స్పందించారు. బడ్జెట్ సెషన్స్ గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగా బడ్జెట్ సమావేశాలు ఉంటున్నాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని గవర్నర్ తమిళిసై తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఐదు నెలల తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ, కొనసాగింపు అని చెప్పడాన్ని తప్పుపడుతూ ఆమె ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంవల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశానని ప్రకటించారు గవర్నర్. తెలంగాణ ప్రభుత్వానికి రాజ్ భవన్ కు మధ్య విభేదాలు బాగా ముదిరిపోయిన పరిస్థితి, గ్యాప్ పెరిగిపోయిందని కనిపిస్తోంది. గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. అప్పటి నుంచి వివాదం రాజుకుంది. ప్రతీసారి గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తారు. కానీ, ఈసారి జనవరి 26న ఉత్సవాలను పరిమిత సంఖ్యలోనే రాజ్ భవన్ లో నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వెలువడింది. అయితే రాజ్ భవన్ లో గవర్నర్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం పాటుగా మంత్రులు కూడా దూరంగా ఉండటంతో వివాదాలు పెరుగుతున్నాయని విమర్శకులు భావించారు. ఇక ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో గ్యాప్ మరింత పెరిగిందని చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు. కేంద్రంలోని బిజెపి సర్కార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ముదిరిన వివాదాల కారణంగానే గవర్నర్ తమిళిసై ని దూరం పెడుతున్నారని భావిస్తున్నారు. అయితే రాజ్యాంగ పరమైన పదవులకు రాజకీయాలను ఎందుకు కలపాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు గవర్నర్ స్పందించడంతో ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనే చర్చ మొదలైంది.

Next Story