ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డ ఘటనలో అధికారి సస్పెన్షన్
ప్రజాపాలన దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
By Srikanth Gundamalla
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డ ఘటనలో అధికారి సస్పెన్షన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అన్ని గ్యారెంటీలకు కలిపి ఒకే దరఖాస్తు స్వీకరించింది. ప్రజా పాలన పేరుతో దరఖాస్తులను తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని డేటా ఎంట్రీ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈక్రమంలోనే డేటా ఎంట్రీ కోసం ప్రజాపాలన దరఖాస్తులను తీసుకెళ్తున్న క్రమంలో బాలానగర్‌లో రోడ్డుపై పడిపోయాయి. బాలానగర్ ఫ్లై ఓవర్‌పై దరఖాస్తులు పడిపోవడంతో వాహనదారులు స్పందించి ట్రాన్స్‌పోర్టు చేస్తున్న వ్యక్తిని నిలదీశారు. ఆ సంఘటను సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఆ తర్వాత వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
రాష్ట్ర ప్రజలు సదురు వీడియోపై ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. పలువురు నెటిజన్లు అధికారుల నిర్లక్ష్యం పట్ల మండిపడ్డారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. ప్రజల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారిపై చర్యలు తీసుకుంది. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్ సూపరింటెండెంట్ మహేందర్‌ను సస్పెండ్ చేశారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఈ మేరకు జీవో జారీ చేశారు. రోడ్డుపై పడిపోయిన అప్లికేషన్లు హయత్‌నగర్ మండలానికి చెందినవని వీడియో ద్వారా తెలిసింది. ఇక విచారణ జరిపిన తర్వాతే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు.
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడిపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
— Newsmeter Telugu (@NewsmeterTelugu) January 9, 2024
బాలానగర్‌లో డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తుండగా పడిపోయిన ప్రజాపాలన దరఖాస్తులు
బాధ్యులైన హయత్‌నగర్ సూపరింటెండెంట్ మహేందర్‌పై సస్పెన్షన్ వేటు
ఉత్తర్వులు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ pic.twitter.com/tJDyqCeOpP