రూపాయికే సిలిండర్.. ఎన్నికల హామీలతో ట్రెండింగ్‌లో ఓ అభ్యర్థి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 12:22 PM ISTరూపాయికే సిలిండర్.. ఎన్నికల హామీలతో ట్రెండింగ్‌లో ఓ అభ్యర్థి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓట్లు పడేందుకు ఎన్నికల మేనిఫెస్టో పాత్ర ప్రధానమైనది అందరికీ తెలిసిందే. ఎవరికి తోచిన హామీలను వారు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చాక కొన్నింటిని అమలు చేస్తే.. ఇంకొన్ని అమలు చేయలేకపోవచ్చు. అయితే.. ఓ అభ్యర్థి కూడా అనూహ్యమైన హామీలు ఇస్తూ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్య, వైద్యం, న్యాయ సేవలు.. ఇలా ఏదైనా సరే రూపాయికే అందిస్తా అని చెబుతున్నాడు. రూపాయికే ఏడాదికి నాలుగు సిలిండర్లు చొప్పున అందిస్తానంటున్నాడు. అంతేకాదు.. ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం ప్రత్యేక పథకం కూడా ప్రకటించాడు. ప్రతీ వంద ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తానని.. ఇంట్లో అమర్చిన పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సేవలందించేలా ఏర్పాట్లు చేస్తానని చెబుతున్నాడు. మిగతా పార్టీల అభ్యర్థులను ఓడించి తన గెలుపును ఖాయం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు వెంకటేశ్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గం ఎన్నికల బరిలో దిగాడు. ఇలాంటి హామీలను ఇస్తూ సెన్షేషనల్‌గా మారాడు.
అయితే.. సనత్‌నగర్ నుంచి వెంకటేశ్ యాదవ్ ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టికెట్‌పై బరిలో నిలబడ్డాడు. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఉన్నతవిద్యావంతురాలు, డాక్టర్ కోట నీలిమ పోటీ చేస్తున్నారు. ఇలా బలమైన అభ్యర్థులపై పోటీ చేస్తున్న వెంకటేశ్ యాదవ్.. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు .. ప్రజలను ఆకర్షించేందుకు కొత్తకొత్త హామీలను ఇస్తున్నారు. వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వాలు క్రమంగా పెంచుతూ పోతున్నాయని.. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్ అంటున్నాడు. ఈ క్రమంలోనే సామాన్యులపై భారం దించేందుకు సిలిండర్‌ను రూపాయికే అందిస్తానని హామీ ఇస్తున్నాడు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌గా కొనసాగుతున్నాడు సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్ యాదవ్.