Sangareddy: గుడిలో భజన కోసమని పొలంలో గంజాయి సాగు
భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తామని ఓ వ్యక్తి గంజాయి మొక్కలను పెంచాడు.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 8:45 PM ISTదేవాలయంలో భజనలు చేస్తారు .. భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తామని ఓ వ్యక్తి గంజాయి మొక్కలను పెంచాడు. ఇదే తమ ఆనవాయితీగా వస్తుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి 30 గుంటల స్థలంలో గంజాయిసాగు చేసిన మొక్కలను పీకేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బట్‌పల్లి మండలం మరివెల్లి గ్రామంలో జుట్టు చిన్న నర్సింహులు నివాసం ఉంటున్నాడు. అతను 125/యు/2 అనే సర్వే నెంబరులోని 30 గుంటల స్ధలంలో పత్తి, మిరప సాగు చేస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తోటల మధ్యలో గంజాయిని కూడా సాగు చేశాడు. దీని గురించి సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సి.వీణారెడ్డి తన సిబ్బందితో కలిసి అతని తోటకు వెళ్లారు. అక్కడ పరిశీలించగా గంజాయి మొక్కలు కనిపించాయి.
ఎక్సైజ్ అధికారులు తన పొలానికి వచ్చారని తెలుసుకున్న నర్సింహులు కూడా అక్కడికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. తమ గ్రామ దేవాలయంలో భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తామనీ.. అందుకే ఇక్కడ సాగులో వేశానని చెప్పాడు. అంతేకానీ.. తాను డబ్బుల కో సం విక్రయించేందుకు పెంచడం లేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ.. ఎక్సైజ్ శాఖ అధికారులు గంజాయి మొక్కలను పీకేశారు. పోలీసుల సమక్షంలో ఈ పని చేశారు. పొలంలో గంజాయి సాగును గుర్తించి.. అడ్డుకున్న అధికారులను తెలంగాణ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు అభినందించారు.