గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్.. స్థలం కేటాయింపు

ప్రజా గాయకుడు గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్ అయింది.

By Srikanth Gundamalla  Published on  30 Jan 2024 10:52 AM GMT
gaddar statue, sangareddy, tellapur municipality,

గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్.. స్థలం కేటాయింపు 

తెలంగాణ ఉద్యమంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆయన గానంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా మారారు. అయితే.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొద్దికాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసింది. దానికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విగ్రహ ఏర్పాటుకు కావాల్సిన స్థలం హెచ్‌ఎండీఏ పరిధిలోనిది కావడంతో అనుమతులకు కొంచెం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఎలాగోలా గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి.. స్థలం కేటాయించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ ఇటీవల అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిచెందిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో చర్చకు కూడా దారి తీశాయి. అయితే.. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మరణవార్త తెలుసుకున్న తర్వాత ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం.. అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింట్లో ముందుడి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి.


Next Story