మైనార్టీలకు శుభవార్త చెప్పిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుభవార్త వినిపించారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 11:41 AM GMTమైనార్టీలకు శుభవార్త చెప్పిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుభవార్త వినిపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేద మైనార్టీలకు ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థికసాయం అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీశ్‌రావు. ఇప్పటికే మైనార్టీలకు ఆర్థిక సాయంపై సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రెండు, మూడు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడతాయని హరీశ్‌రావు ప్రకటించారు.
హైదరాబాద్‌లోని జలవిహార్‌లో పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మైనార్టీలకు ఆర్థికసాయంపై ప్రకటన చేశారు.
మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని చెప్పారు హరీశ్‌రావు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రి చేశారని అన్నారు. హిందువులకు కల్యాణలక్ష్మి అమలు చేసినట్లే.. మైనార్టీల కోసం షాదీముబారక్ పథకం తీసుకొచ్చామని గుర్తుచేశారు. బీసీలకు ఇస్తున్నట్లే మైనార్టీలకు ఆర్థిక సాయం కింద రూ.లక్ష అందిస్తామని తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. రెండ్రోజుల్లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు మంత్రి హరీశ్‌రావు.
కేంద్రంలో ఉన్న ఏ పార్టీ ఇప్పటివరకు మైనార్టీల కోసం ఏమీ చేయలేదని చెప్పారు. అందుకే దేశంలో ముస్లింలు ఇప్పటికీ పేదవారిగానే మిగిలిపోయారని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ కడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలతో మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు,ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.